Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఎల్ నినొ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దు..

ఎల్ నినొ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దు..

నేటి సత్యం హైదరాబాద్ జూలై20

ఎల్‌నినో‌ ప్రభావాన్ని ప్రజలపై పడనీయొద్దు

తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంవర్ధకం సహా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

జూలై 31 నాటికి శాఖల వారీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి

అన్ని శాఖలు యుద్ధ యుద్ధప్రాతిపదికన పనులు చేయాలి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమీక్షలో ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు యుద్ధప్రాతిపదికన పనిచేయాలని ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ కలెక్టరేటులో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎల్‌నినో కంటింజెన్సీ సమీక్ష సమావేశంలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితులను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు.

సమావేశంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ఎల్‌నినో ఎక్స్‌పర్ట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ షఫీ ఉల్లా, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, మెఘా రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, విజయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐదు జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా ప్రస్తుత పరిస్థితులను, భవిష్యత్ కార్యాచరణను అధికారులు మంత్రికి వివరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణంగా ఈ సమయానికి నమోదు కావాల్సిన వర్షపాతంతో పోలిస్తే సుమారు 40 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికతో పనిచేస్తేనే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా తగ్గించగలమన్నారు.

ఎల్‌నినో అంటే ఏమిటి, దాని ప్రభావం ప్రజల జీవితాలపై, వ్యవసాయంపై ఎలా ఉంటుందో గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అనవసర ఆందోళన కలగకుండా శాస్త్రీయ సమాచారం అందించాలని సూచించారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా నది జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నిండిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం వచ్చే పరిస్థితి ఉంటుందని అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థంగా వినియోగిస్తూ తాగునీటికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పనిచేయని హ్యాండ్‌పంపులు, బోర్లను వెంటనే మరమ్మతు చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

భూగర్భ జలాల మట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను వేగవంతం చేయాలని, బోర్‌వెల్ రీచార్జ్, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యాంలు, పర్కొలేషన్ ట్యాంకులు, ఇతర నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టి భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యవసాయ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలని మంత్రి ఆదేశించారు. అధిక నీటి అవసరం ఉండే పంటలకు బదులుగా తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పూర్తయ్యే పూలు, ఉద్యాన పంటలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు విత్తనాలు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టాలని, అవసరమైతే సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ రోజులు ఉపాధి కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, వ్యవసాయం, తాగునీటి అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. తాగునీటి కొరత కారణంగా నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అత్యవసర వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధుల నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలు, క్లోరినేషన్, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించినట్లే, ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. మండల స్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

జూలై 31 నాటికి అన్ని శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలు, అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాటి అమలుకు అవసరమైన అదనపు బడ్జెట్ కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఎల్‌నినో కారణంగా ఒక్కోసారి కుంభవృష్టి వర్షాలు పడి వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల వల్ల ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని మంత్రి హెచ్చరించారి. పంచాయతీరాజ్, మునిసిపల్ డిపార్ట్‌మెంట్, నీటి పారుదలశాఖ అధికారులు ఈ అంశంపై కూడా శ్రద్ధ పెట్టాలని మంత్రి సూచించారు.

ప్రజలు, రైతులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇది మనుషులు సృష్టించిన సంక్షోభం కాదు… ప్రకృతి తెచ్చిన సవాల్. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలపై ఎల్‌నినో ప్రభావం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమష్టిగా పనిచేస్తే ఈ పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కోగలమని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments