Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకేంద్రానికి రైతుల డెడ్ లైన్..?

కేంద్రానికి రైతుల డెడ్ లైన్..?

నేటి సత్యం/ హైదరాబాద్/ ఆగస్టు19

కేంద్రానికి రైతుల డెడ్‌లైన్‌..

29లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళనలు

భారత్‌- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్‌కు అనుమతివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసనలు మంగళవారం నాటికి మూడో రోజుకు చేరాయి.

ఆగస్టు 29లోగా తమ డిమాండ్లను పరిష్కరించకుంటే దేశవ్యాప్త నిరసనలు చేపట్టి, మహా పంచాయత్‌తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. మంగళవారం రైతులు ఖనౌరీ దాతా సింగ్‌వాలా సరిహద్దు వద్ద టెంట్లు వేసుకుని నిరసనలు కొనసాగించారు.

కాలినడకన ఢిల్లీకి వెళ్లేందుకు తమకు అనుమతినివ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మంగళవారం సంయుక్త కిసాన్‌ మోర్చా కార్యకర్తల కీలక సమావేశం జరగనుంది. దీనిలో రైతు నిరసనల తదుపరి వ్యూహాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం.

దేశాన్ని ట్రంప్‌కు అమ్ముకోకూడదు

అమెరికా వ్యవసాయ దిగుమతుల గురించిన భయాలు మొదలుకొని, విద్యుత్తు సరఫరా లైన్లు, నష్టపరిహారం వరకూ దేశవ్యాప్తంగా రైతులు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్‌ నేత, గుజరాత్‌కు చెందిన వైద్యుడు, రైతు అయిన డాక్టర్‌ దినేష్‌ భాయ్‌ పర్మార్‌ దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌కు తెలిపారు.

ప్రతిపాదిత భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాదిమంది రైతులు దేశవ్యాప్తంగా రెండు నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, మనం దీనిపై మౌనంగా ఉండలేమని, ఈ విధంగా భారతదేశాన్ని ట్రంప్‌కు అమ్ముకోకూడదన్నారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కారణంగా చౌకైన అమెరికన్‌ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశించి, దేశీయ వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయని భయపడుతూ పంజాబ్‌, హర్యానాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారన్నారు.

ఈ ఒప్పందం కేవలం తమపైనే కాకుండా తమపై ఆధారపడిన శ్రామికులు, దుకాణదారులు, చివరకు వినియోగదారులతో సహా మొత్తం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రైతులు అంటున్నారు. మరోవైపు గుజరాత్‌లోని మోర్బీలో వ్యవసాయ భూముల్లో రాష్ట ప్రభుత్వం హై వోల్టేజీ విద్యుత్‌ సరఫరా లైన్లు, విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా రైతుల నిరసనలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి.

వీటివల్ల తమ వ్యవసాయ భూములను కోల్పోతున్నామని, అలాగే తక్కువ పరిహారం అందుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ రైతులు తమ పెసర పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ భోపాల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఎరువుల కొరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థిక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా, కేంద్ర టేడ్‌ యూనియన్లు కూడా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చాయి. తమిళనాడు, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో పలు కార్మిక సంఘాలు ఈ నిరసనలకు నాయకత్వం వహించాయి. రైతుల ఆదాయాన్ని, భూమిని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వం తమ మొర వినాలని రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments