మాదాపూర్‌లో కుక్కల దాడి… ఆవు మృతి
గన్నేరువరం, ఏప్రిల్ 13 ( నేటి సత్యం):
గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో కుక్కల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక ఘటన మరవకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
గ్రామానికి చెందిన బైరి బుచ్చిరెడ్డికి చెందిన సుమారు రూ.60 వేల విలువ గల పాడి ఆవును ఆదివారం కుక్కలు దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. కుక్కలు ఆవును కొరికి తినడంతో రైతు తీవ్ర నష్టపోయినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికుల వివరాల ప్రకారం… సమీప ప్రాంతాల్లో కోళ్ల వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయడం వల్ల కుక్కలు గుంపులుగా చేరుతున్నాయని అన్నారు. ఈ కుక్కలు పశువుల పాకల్లోకి చేరి వందల సంఖ్యలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.
ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.