Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogవేతనాలు పెంచమంటే...!?

వేతనాలు పెంచమంటే…!?

నేటి సత్యం హైదరాబాద్ ఏప్రిల్ 16 * వేతనాలు పెంచమంటే…!

రెక్కలు ముక్కలు చేసుకున్నా కనీస అవసరాలు కూడా తీరకపోవడంతో వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై ఉత్తరప్రదేశ్‌, హర్యానా ప్రభుత్వాలు విరుచుకుపడుతున్న తీరు దుర్మార్గం! నెలల తరబడి విజ్ఞప్తులు చేసినా, రాయబారాలు జరిపినా కనీస స్పందన లేకపోవడంతో కార్మికులకు ఆందోళనలకు దిగడం మినహా మరోమార్గం లేకుండా పోయింది. సోమవారం నాడు తొలుత రెండు మూడు యూనిట్ల వద్ద శాంతియుతంగా కార్మికుల ఆందోళన ప్రారంభమైంది. ఆ తరువాత ఒకటి, రెండు గంటల్లోనే 80కిపైగా ప్రదేశాలకు విస్తరించడం, 45 వేల మందికిపైగా భాగస్వాములు కావడం పారిశ్రామిక వాడల్లో పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో, కార్మికులు ఎంతగా విసిగి పోయి ఉన్నారో చెప్పడానికి నిదర్శనం. శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన బిజెపి ప్రభుత్వాలు దానికి భిన్నంగా వ్యవహరించి, భయభ్రాంతులను చేయడమే లక్ష్యంగా పోలీసులను ఉసిగొల్పాయి. అయినా, వెనక్కి తగ్గని కార్మికులు వేతనాల పెంపుతో పాటు, పని ప్రదేశంలో భద్రత, ముందస్తు నోటీసు లేకుండా తొలగింపు, పనిగంటల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మరింత ఉధృతంగా తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అణచివేత చర్యలకు దిగింది. 300 మందికి పైగా కార్మికులను, నేతలను అరెస్ట్‌ చేసింది. కార్మిక వాడలతో పాటు, సమీపంలోని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. కార్మికులను కొట్టడంతో పాటు, కనపడిన వారికి కనపడ్డట్టుగా ఎత్తుకుపోతున్నారంటూ వస్తున్న వార్తలు భయం కలిగిస్తున్నాయి. వారిని ఎక్కడకు తరలిస్తున్నారో కూడా చెప్పడం లేదంటూ కార్మిక కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. కార్మికులకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని సైతం పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించడానికి బాధ్యత వహించాల్సిన కార్మికశాఖ మంత్రి విదేశీ శక్తుల మద్దతుతో ఆందోళనలు జరుగుతున్నాయనడం, కార్మికులను ఉగ్రవాదులతో పోల్చడం సిగ్గుచేటు!

దేశ రాజధాని న్యూఢిల్లీకి అత్యంత సమీపంగా ఉండే నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గురుగావ్‌లలోని నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సిఆర్‌)పారిశ్రామిక బెల్ట్‌ లోని వివిధ ఫ్యాక్టరీల కార్మికులు చట్టబద్ద హక్కులు, కనీస జీవన ప్రమాణాల కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన లేబర్‌ కోడ్‌లతో కనీస వేతనం అన్న భావన రద్దు అయ్యింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఫ్యాక్టరీల యజమానులు పెద్ద ఎత్తున శ్రమ దోపిడి ప్రారంభించారు. ఎన్‌సిఆర్‌ విస్తరించి ఉన్న ఉత్తరప్రదేశ్‌, హర్యానాల్లోని బిజెపి ప్రభుత్వాలు యాజమాన్యాల ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతో కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. రోజుకి పది గంటలపైగా పని చేసినా 300 రూపాయల వేతనం లభించడం కూడా కష్టంగా మారింది. దీంతో పాటు లేబర్‌ కోడ్‌ల పుణ్యమా అని కాంట్రాక్టు వ్యవస్థ కార్మికుల పని భద్రతను ప్రశ్నార్ధకంగా మార్చింది. ఎప్పుడు ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో పనికోసం, వేతనాల కోసం యాజమాన్యాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి కార్మికులకు ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకున్న యాజమాన్యాలు పని ప్రదేశాల్లో భద్రతా చర్యలను దాదాపుగా విస్మరించాయి. పెద్ద ఎత్తున అమానవీయ చర్యలకు, శ్రమ దోపిడికి దిగాయి.

అయితే, ఈ పరిస్థితి ఎల్లకాలం సాగదు కదా! వేతనాలు పెంచాలని, చట్టబద్దమైన ప్రయోజనాలు అమలు చేయాలని కార్మికులు కొంత కాలంగా ఆందోళనకు దిగారు. గత రెండున్నర మాసాలుగా ఈ నిరసనలు సాగుతున్నాయి. అప్పటి నుండి ఈ ఆందోళనలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అప్పటి నుండి అరెస్ట్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని సిఐటియు నేతలను కొద్ది రోజులగా గృహ నిర్బంధంలో ఉంచారు. అయినా, ఎన్‌సిఆర్‌లో కార్మికుల తిరుగుబాటును ఆపలేకపోయారు. ఇప్పటికైనా పరిస్థితి తీవ్రతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలి. అన్ని రకాల అణచివేత, ప్రతీకార చర్యలను తక్షణమే ఆపివేయాలి. కార్మికులతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చించి వారి డిమాండ్లను పరిష్కరించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments