బొగ్గు గ్యాసిఫికేషన్‌లోకి సింగరేణి అడుగులు
- భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్టుకు సన్నాహాలు
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో
హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్ నాగులపల్లితో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి
సింగరేణిని బహుముఖంగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొగ్గు గ్యాసిఫికేషన్ రంగంలోకి ప్రవేశించే అవకాశాలను సింగరేణి సమగ్రంగా పరిశీలిస్తోందని సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం సింగరేణి భవన్‌లో పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగులపల్లి శ్రీకాంత్ తో జరిగిన సమావేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌పై సింగరేణి చేపడుతున్న చర్యలను సీఎండీ వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో రోజుకు 400 టన్నుల సామర్థ్యంతో అమ్మోనియం నైట్రేట్ మెల్ట్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రాజెక్టు పెట్టుబడిపై రాబడి ఆశాజనకంగా లేదని, మరింత మెరుగుపరిచేందుకు ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వినియోగం, స్వదేశీ సాంకేతికత వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఇదే విషయంపై తాల్చేర్, ఎంసీఎల్–బీహెచ్ఈఎల్, జేఎస్పీఎల్ తదితర కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అధ్యయనం చేయడానికి ఈ నెలలో సింగరేణి అధికారుల బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. అలాగే భీమారం, చెన్నూరు సౌత్, నైనీ ప్రాంతాల్లో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అవకాశాలపై సాంకేతిక-ఆర్థిక విశ్లేషణ కొనసాగుతోందన్నారు.
భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ విషయంలో కూడా బెల్లంపల్లి, రామగుండం ప్రాంతాల్లోని లోతైన బొగ్గు నిల్వల్లో ఐదు బ్లాక్‌లను గుర్తించినట్లు తెలిపారు. తొలి పైలట్ ప్రాజెక్టును బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్లో చేపట్టేందుకు డ్రిల్లింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని, సీఎంఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తల సాంకేతిక మార్గదర్శకత్వంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.
ఈ సమావేశంలో డైరెక్టర్లు శ్రీ ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), శ్రీ కె.వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), శ్రీ గౌతమ్ పోట్రు (పర్సనల్ & ఫైనాన్స్), ఈడీ (కోల్ మూవ్‌మెంట్) శ్రీ బి. వెంకన్న, జీఎం (కోఆర్డినేషన్ & మార్కెటింగ్) శ్రీ టి. శ్రీనివాస్, జీఎం(పీపీ) శ్రీ జి.దేవేందర్, జీఎం(బిజినెస్ డెవలప్‌మెంట్) శ్రీ రాందాస్, జీఎం(ఆర్ అండ్ డీ) శ్రీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.