భారీ వర్షాలు, మెరుపుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జూలై 29 (నేటి సత్యం ప్రతినిధి)జిల్లాలో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు ఆయన బుధవారం మనిషి కళా అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులకు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
“వర్షాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నదులు, వాగులు, చెరువులు, కాలువలు వంటి నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. వరద నీటిని దాటే ప్రయత్నం చేయడం ప్రమాదకరం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
వర్షాల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపంలో ఉండరాదని, మెరుపులు పడే అవకాశం ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని, రహదారులు జారుడు స్వభావం కలిగి ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. కలుషితమైన ఆహారం, తాగునీటిని ఉపయోగించకుండా ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా అత్యవసర నియంత్రణ కేంద్రాన్ని (కంట్రోల్ రూమ్) 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశామని, అవసరమైన సహాయక చర్యలకు అన్ని శాఖలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
వరదలు, భారీ వర్షాల వల్ల ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే స్పందించేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి” అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు
.ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు రహదారుల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని, పంచాయతీరాజ్ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గొర్రెల కాపరులు, పశుపోషకులు తమ పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే గ్రామ, మండల అధికారులకు లేదా జిల్లా నియంత్రణ కేంద్రానికి సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు.