నేటి సత్యం /హైదరాబాద్ /సెప్టెంబర్ 5
ప్రజా ఉద్యమాల బలోపేతానికి యువత, విద్యార్థులు ముందుండాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ నరసింహ పుట్టినరోజు వేడుకలను ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ రిజిస్ట్రార్ ఉప్పరి ఎల్లేష్ ఆధ్వర్యంలో శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఈటీ నరసింహకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఈటీ నరసింహ మాట్లాడుతూ, తన పుట్టినరోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థి ఉద్యమంలో కలిసి పనిచేసిన పాత సహచరులు, మిత్రులు తనను గుర్తు చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థి దశ నుంచే అన్యాయానికి వ్యతిరేకంగా, విద్యార్థుల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు నిర్వహించిన అనుభవం తన రాజకీయ జీవితానికి ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అసమానతలు, నిరుద్యోగం, విద్యా–ఉపాధి రంగాల్లో నెలకొన్న సమస్యలపై యువత, విద్యార్థులు ప్రశ్నించే గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా పోరాడాలని అన్నారు.
యువతే దేశ భవిష్యత్తు అని, యువతలో ప్రశ్నించే తత్వాన్ని, పోరాట స్ఫూర్తిని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి, యువజన ఉద్యమాలను గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తరించి, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా ఉప్పరి ఎల్లేష్ మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమంలో ఈటీ నరసింహతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన ఈటీ నరసింహకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. బాల నరసింహ, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రి శ్రీమన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రెహమాన్, ప్రేమ్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు కిషన్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.